తెలంగాణ సాధకుడు కేసీఆర్..!
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్దపడ్డ గొప్ప నాయకుడు KCR అని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం దీక్షా దివస్ సందర్బంగా తెలంగాణ భవన్ లో నిర్వహించే కార్యక్రమం ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, తలసాని శ్రీనివాస్ యాదవ్ శాసనమండలి లో ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, దీక్ష దివస్ హైదరాబాద్ జిల్లా ఇంచార్జి ఇంచార్జి పొన్నాల లక్ష్మయ్య, సికింద్రాబాద్, అంబర్ పేట, ముషీరాబాద్ MLA లు పద్మారావు గౌడ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, మాజీమంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, నాంపల్లి, ఖైరతాబాద్ నియోజకవర్గాల ఇంచార్జి లు ఆనంద్ గౌడ్, మన్నె గోవర్ధన్ రెడ్డి తదితరులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు.
ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ BRS పార్టీ అద్యక్షులు KCR చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష తెలంగాణా ఉద్యమాన్ని కీలకమలుపు తిప్పిందని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రం రావాలి…తెలంగాణ రాష్ట్రం కావాలని నినదించడం జరిగిందని వివరించారు. అటువంటి దీక్షా దివస్ ను అత్యంత ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని అన్ని నియోజకవర్గాల నుండి బైక్ ల పై ర్యాలీగా బసవ తారకం హాస్పిటల్ సర్కిల్ వరకు చేరుకుంటారని, అక్కడి నుండి పాదయాత్రగా తెలంగాణ భవన్ కు చేరుకోనున్నట్లు చెప్పారు.
తెలంగాణ భవన్ లో సాంస్కృతిక కార్యక్రమాలు, KCR ఉద్యమ నేపధ్యాన్ని వివరించేలా ప్రత్యేకంగా రూపొందించిన డాక్యుమెంటరీ ని ప్రదర్శించడం జరుగుతుందని, అనంతరం సభ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.