ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉపాధ్యాయులను ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వసతి గృహం ఆవరణను పరిశీలించారు.
అక్కడి నుంచి కిచెన్, స్టోర్ రూంకు వెళ్లి సరుకుల నాణ్యత, ఆహార పదార్థాలను పరిశీలించి, పలు సూచనలు చేశారు. అనంతరం తరగతి గదుల్లో విద్యార్థులు చదువుతుండగా, వెళ్లి పరిశీలించారు. సిలబస్ ఎక్కడి వరకు పూర్తి అయిందని ప్రిన్సిపాల్ ను ఆరా తీశారు. ఇప్పటికే పూర్తి అయిందని, ప్రస్తుతం రివిజన్ చేయిస్తున్నామని కలెక్టర్ దృష్టికి ప్రిన్సిపాల్ థెరిసా తీసుకువెళ్ళారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. రానున్న పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపేలా సిద్ధం చేయాలని, ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు.కార్యక్రమంలో హాస్టల్ ఉపాద్యాయినులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
