మళ్లీ బిందెలెందుకు ప్రత్యక్షమవుతున్నయ్‌..? నీటిమోతలెందుకు ?- రేవంత్‌ సర్కారు నిలదీసిన కేసీఆర్‌

 మళ్లీ బిందెలెందుకు ప్రత్యక్షమవుతున్నయ్‌..? నీటిమోతలెందుకు ?- రేవంత్‌ సర్కారు నిలదీసిన కేసీఆర్‌

మళ్లీ బిందెలు ఎందుకు ప్రత్యక్షమవుతున్నయ్‌ ? ఎందుకు నీటిమోతలు స్టార్ట్‌ అయ్యాయంటూ రేవంత్‌రెడ్డి సర్కారు బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిలదీశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు.బీఆర్‌ఎస్‌ పాలనలో అద్భుతంగా మారి, ఉన్నత శిఖరాలకు చేరుకొని దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో నెంబర్‌ వన్‌ స్థాయికి చేరుకొని.. ఇంత స్వల్ప కాలంలో ఎందుకు ఈ బాధకు గురి కావాలి ? దీనికి కారణం ఏంటీ. ప్రపంచ దేశాలు, యూఎన్‌ఓ, 15-16 రాష్ట్రాలు కొనియాడి అమలు చేసుకుంటున్న పథకం మిషన్‌ భగీరథ. రాష్ట్రంలో ఎందుకు మంచినీళ్ల కొరత రావాలి ? చీఫ్‌ సెక్రెటరీ స్టేట్‌మెంట్‌లో సోర్సెస్‌ అన్నీ బారాబరి ఉన్నయ్‌.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అద్భుతంగా ఉండవచ్చని చెబుతున్నరు’ అని కేసీఆర్‌ అన్నారు.

దానికి జర్నలిస్టులే సాక్షి..

‘హైదరాబాద్‌ సిటీలో ఒక రూపాయికే నల్లా కన్షెన్‌ ఇచ్చి.. 20వేల లీటర్ల ఫ్రీ నీరు, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంట్లో నల్లాపెట్టి నీరిచ్చాం. దీనికి జర్నలిస్టులే సాక్షి. దానిలో ఎందుకు లోపం వస్తుంది. ఏంది కారణం ? మేం అసెంబ్లీలో ఛాలెంజ్‌ చేశాం. నేను స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ టర్మ్‌లోగా భగీరథ కంప్లీట్‌ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని.. ఓట్లు అడగదని ఛాలెంజ్‌గా చెప్పి పథకాన్ని పూర్తి చేశాం. ఆ తర్వాత ఐదేళ్లు బ్రహ్మాండంగా నడిపాం. బిందెపట్టుకొని ఆడబిడ్డ ఎక్కడా రోడ్డుపై కనిపించలేదు. అన్నీ మామయ్యాయి. మంచినీళ్లు ట్యాంకర్లు ఐదుసంవత్సరాల్లో కనిపించలేదు. ఎందుకు మళ్లీ బిందెలు ప్రత్యక్షమవుతున్నయ్‌ ? ఎందుకు నీటిమోతలు స్టార్ట్‌ అయ్యాయి. నీళ్ల ట్యాంకర్లు ఎందుకు విచ్చలవిడి వ్యాపారం చేస్తున్నయ్‌. హైదరాబాద్‌ సిటీలో ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపురిస్తుంది ? ఇవీ ఆలోచించాల్సిన విషయాలు’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పడు కరెంటు ఉంటే వార్త అనేకాడికి వచ్చింది..
ఒకటింబావు సంవత్సరంలో చాలాదారుణంగా ఉన్న విద్యుత్‌ రంగాన్ని సుమారు రూ.35వేలకోట్లు ఖర్చు చేసి.. రకరకాల పద్ధతులు అవలంభించి.. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీని సంప్రదించి.. మెదడును కరుగదీసి.. విద్యుత్‌ రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. భారతదేశంలో అన్నిరంగాలకు 24గంటలు ఒక సెకండ్‌ కరెంటుపోకుండా ఏర్పాటు చేసిన ఘనత మా ప్రభుత్వానిది. మీరు అందరూ అనుభవించారు. నాడు కరెంటు పోతే వార్త.. ఈ రోజు కరెంటు ఉంటే వార్త అనేకాడికి వచ్చింది. విద్యుత్‌ అనేది చిన్న విషయం కాదు. నోటిమాటలు.. పిట్టకథలు కాదు కదా. అద్భుతమైన వ్యవస్థ. దాన్ని తీర్చిదిద్ది.. ఏడున్నర, ఎనిమిదేళ్లు అద్భుతంగా ప్రజలకు సరఫరా చేశాం. ప్రజలకు, పరిశ్రమలు, వ్యవసాయానికి, ఐటీకి, ఇతర రంగాలకు 24/7 కరెంటు సరఫరా చేసిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ’ అని గుర్తు చేశారు.

రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది?
‘ఒక అగ్రగామి రాష్ట్రం. ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది ఇయ్యాల. వంద రోజుల్లో ఇంత అస్తవ్యస్తం ఏందీ? దీంట్లో ఉన్న తమషా ఏందీ ? కొత్తగా నడిపించేది ఏమీ లేదు.. కొత్తగా మొద్దులు మోసేది లేదు.. కట్టెలు కొట్టేది లేదు. కొత్త గడ్డపారలు పట్టి తవ్వేది లేదు. ఉన్న వ్యవస్థ ఉన్నట్లు నడిపించలేని అసమర్థత ఏందీ? అశక్తత ఏందీ? కట్టిన ఇల్లు. పెట్టిన పొయ్యే కదా? దాన్నే నడిపించే తెలివిలేకపోతే ఎలా? మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే.. ఇప్పుడున్న, రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ ప్రభుత్వ అసమర్థత, అవివేకం, తెలివితక్కువ తనం, అవగాహనా రాహిత్యం, దేన్నీ ఎట్లా వాడాలో తెలియని అర్భకత్వం మనకు కనిపిస్తుంది. ఉన్న కరెంటును, మిషన్‌ భగీరథను వాడుకునే తెలివి లేదు. అద్భుతంగా వచ్చే హైదరాబాద్‌ నీళ్లు లేవు. మళ్లీ వాటర్‌ బిల్స్‌.. ట్యాంకర్ల వ్యాపారం జరుగుతుంది. కొనలేక జనం చస్తున్నరు. మళ్లీ జనరేట్లర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తున్నయ్‌. మళ్లీ స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది’ అంటూ కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *