132 ఏళ్ల తర్వాత డొనాల్డ్ ట్రంప్ రికార్డు..
అమెరికాలో ఏ వ్యక్తి అయినా రెండు సార్లు అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది. అంటే మొత్తంగా ఎనిమిదేళ్ల పాటు అధ్యక్షుడిగా/అధ్యక్షురాలిగా ఉండొచ్చు. ఇటీవల కాలంలో మనం వరుసగా రెండు సార్లు అధ్యక్ష పదవిలో ఉన్న వారిని చూశాము.
సీనియర్ బుష్, క్లింటన్, జూనియర్ బుష్, ఒబామా.. ఇలా. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం 2016లో అధ్యక్షుడై.. 2020లో దిగిపోయాడు. మళ్లీ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి అధ్యక్షుడు అయ్యాడు. అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో 132 ఏళ్ల తర్వాత ఇలాంటి ఘనత సాధించిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్.
అమెరికాకు 22వ అధ్యక్షుడిగా గ్రోవర్ క్లీవ్‌లాండ్ ఎన్నికయ్యాడు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన క్లీవ్‌లాండ్ తొలి సారి 1885లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. 1884లో ఎన్నికలు జరిగాయి. ఇక 1888లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. కానీ మళ్లీ 1892లో జరిగిన ఎన్నికల్లో గెలిచి.. 1893లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. ఇన్నేళ్ల తర్వాత డొనాల్డ్ ట్రంప్ అదే ఫీట్ రిపీట్ చేశాడు.