లయ తప్పుతున్న వైసీపీ..టీడీపీ
సహజంగా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు మాములే.. అధికార పార్టీపై అవినీతి ఆరోపణలు.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష పార్టీ పోరాటాలు ఉద్యమాలు చేయడం ప్రజాస్వామ్యంలో ఓ ప్రక్రియ.. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలకు ఆరోపణలకు ఇష్యూ బేస్డ్ సబ్జెక్ట్ కంటెంట్ తో అధికార పార్టీ తిప్పికొడితేనే హుందాతనం. కానీ ఏపీలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉందని విశ్లేషకులు ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.
ప్రతి ఒక్కరి నుండి పార్టీల వరకు ట్విట్టర్ ,ఫేస్ బుక్ ,ఇన్ స్టా ,వాట్సాప్ వాడటం సాధారణమైన ఈరోజుల్లో ఏపీ అధికార టీడీపీ,ప్రతిపక్ష వైసీపీ తమ తమ అధికారక ఎక్స్ ఖాతాల్లో వాడుతున్న భాషను చూసి మేధావులు,విశ్లేషకులు,ప్రజలు తిట్టుకుంటున్నారు. వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ను కట్ డ్రాయర్ ఎమ్మెల్యే … సైకో.. జలగ,వాడు అని అధికార పక్షమైన టీడీపీ తమ అధికారక ఎక్స్ ఖాతాలో పోస్టులు పెడుతుంది.
మరోవైపు అధికార టీడీపీ అధినేత.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుండి మంత్రి నారా లోకేశ్ వరకు,ఎమ్మెల్యేలందర్ని ప్రతిపక్ష వైసీపీ తమ ఎక్స్ ఖాతాలో నిక్కర్ మంత్రి,పప్పు అని పోస్టులు పెడుతుంది.
రాజకీయంగా మీడియాను,సోషల్ మీడియాను ఓ పద్ధతిగా వాడుకోవడంలో తప్పు లేదు కానీ ఇలా దిగజారుడు భాషను వాడుతూ చిల్లర కామెంట్లు ఏంటని నెటిజన్లు,మేధావులు,రాజకీయ విశ్లేషకులు,ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. ఇప్పటి రాబోవు తరాలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు .. విమర్శ అనేది సహేతుకంగా ,భాషలో హుందాతనం ఉండాలని సూచిస్తున్నారు.