ఆదాయం పెంచడానికి అధికారులు పక్కా ప్రణాళికలతో పని చేయాలి

 ఆదాయం పెంచడానికి అధికారులు పక్కా ప్రణాళికలతో పని చేయాలి

తెలంగాణ రాష్ట్ర వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం పెంచడానికి అధికారులు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకోసం శాఖల మధ్య సమన్వయం ఉండాలని, పన్నుల ఎగవేత విషయంలో ఎలాంటి లొసుగులు లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.

రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. బడ్జెట్‌లో నిర్ధేశించిన మేరకు రాబడి సాధించడానికి నెలవారి టార్గెట్‌తో పనిచేయాలన్నారు.

గత ఏడాది సమకూరిన ఆదాయంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి జీఎస్టీ ఎగవేత లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంచనా మేరకు జీఎస్టీ సాధించడంలో క్షేత్రస్థాయి పరిశీలనలు, ఆడిటింగ్‌లను పకడ్బందీగా జరపాలన్నారు. జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని చెప్పారు.

అక్రమ మద్యం రవాణాను అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.గత ప్రభుత్వం 2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచింది. ఇప్పటికీ చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉంది.

నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో ధరల సవరణకు చర్యలు చేపట్టాలి.రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్థి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భూముల మార్కెట్ ధరల సవరణ జరగాలి.

స్టాంప్‌ డ్యూటీ తగ్గించడమా లేక పెంచడమా అన్న విషయంలో ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలి.సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలి. అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాల కోసం అధునాతన మోడల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు నిర్మించాలి. సామాన్యులకు ఇసుక కొరత రాకుండా అక్రమ రవాణాను, లీకేజీలను అరికట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *