పుష్ప- 2 మూవీ హిట్టా..? ఫట్టా..?

 పుష్ప- 2 మూవీ హిట్టా..? ఫట్టా..?

చిత్రం: పుష్ప2: ది రూల్‌;

నటీనటులు: అల్లు అర్జున్‌, రష్మిక, ఫహద్‌ ఫాజిల్‌, జగపతిబాబు, సునీల్‌, అనసూయ, రావు రమేశ్‌, ధనుంజయ, జగదీశ్‌ ప్రతాప్‌ భండారి, తారక్‌ పొన్నప్ప, అజయ్‌, శ్రీతేజ్ తదితరులు;

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌; సినిమాటోగ్రఫీ: మిరాస్లోవ్‌ కూబా బ్రోజెక్‌; ఎడిటింగ్‌: నవీన్‌ నూలి; నిర్మాత: నవీన్‌ యెర్నేని, రవి యలమంచిలి; సంభాషణలు: శ్రీకాంత్‌ విస్సా; పాటలు: చంద్రబోస్‌; రచన, దర్శకత్వం: సుకుమార్‌; నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌;

విడుదల: 05-12-2024

ఓ పాత్ర బ్రాండ్‌లా మారిపోయిందన్నా… ఓ మేనరిజాన్ని ప్రపంచం మొత్తం అనుకరించిందన్నా అందుకు కారణం… ‘పుష్ప‌: ది రైజ్‌’. అల్లు అర్జున్ కథానాయకుడిగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. దానికి కొనసాగింపు చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’ మొదలవ్వక ముందే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అందుకు దీటుగా ఈసారి నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్.. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటూ ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాడు పుష్పరాజ్‌. మరి ఈ చిత్రం ఎలా ఉంది?(Pushpa 2 Review Telugu)తొలి సినిమాకి దీటుగా ఉందా?

Disclaimer … సినిమా చూడాలి అనుకున్న వాళ్ళు చదవకండి ఇక్కడితో అపేసేయండి …

Pushpa 2 Story: (కథేంటంటే): శేషాచలం అడవుల్లో ఓ కూలీగా ప్రయాణం మొదలుపెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌ను నడిపే నాయకుడిగా ఎదుగుతాడు పుష్ప అలియాస్ పుష్పరాజ్ (అల్లు అర్జున్). తన దారికి ఎవ్వరు ఎదురొచ్చినా సరే తగ్గేదేలే అంటూ ఢీ కొట్టడమే అతడికి తెలుసు. డబ్బంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు. తన పేరునే ఓ బ్రాండుగా మార్చేస్తాడు. ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజిల్)తో వైరం పెరిగి పెద్దదవుతుంది. మరోవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకీ విస్తరించడంపై దృష్టిపెడతాడు. పుష్ప బయట ఫైర్ కానీ… ఇంట్లో మాత్రం పెళ్లాం శ్రీవల్లి (రష్మిక మందన్న) మాట జవదాటడు. తన భర్త సీఎంతో కలిసి ఫొటో తీసుకుంటే చూసుకోవాలనేది ఆమె ఆశ. కోట్లకు పడగలెత్తిన పుష్ప పెళ్లాం చెప్పింది కదాని.. ఎమ్మెల్యే సిద్ధప్పనాయుడు (రావు రమేష్)తో కలిసి సీఎం దగ్గరికి వెళతాడు. అక్కడికి వెళ్లాక ఏం జరిగింది?(Pushpa 2 Review Telugu) షెకావత్‌ని ఢీ కొంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు? ఆ వ్యాపారం రాజకీయాల్ని ఎలా శాసించింది? కేంద్రమంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)కీ, పుష్పకీ సంబంధం ఏంటి? అది వైరంగా ఎలా మారింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: తొలి భాగంతో పోలిస్తే, దర్శకుడు సుకుమార్ (pushpa 2 director) ‘పుష్ప’ ప్రపంచాన్ని, కథ, మేకింగ్‌ పరిధినీ పెంచాడు. నేషనల్ కాదు… ఇంటర్నేషనల్.. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నట్టుగానే అన్ని విషయాల్లోనూ పెరిగిన మోతాదు కనిపిస్తుంది. తొలి సినిమాలో అల్లు అర్జున్‌కు ఉన్న మాస్ ఇమేజ్‌నే నమ్ముకుని ఆయన పాత్ర, హీరోయిజంపైనే దృష్టిపెట్టిన సుకుమార్ ఈసారి తానూ ఛార్జ్ తీసుకున్నాడు. కథలో తన మార్క్ సైకలాజికల్ గేమ్‌ని మేళవించే ప్రయత్నం చేశాడు. దాంతో ఈసారి మరింత డ్రామా పండింది. దానికితోడు వైల్డ్ ఫైర్‌లాంటి పుష్ప‌రాజ్ ఉండనే ఉన్నాడు. (Pushpa 2 Review) మరింత బలంగా తీర్చిదిద్దిన ఆ పాత్రపై అల్లు అర్జున్ పూర్తిస్థాయిలో ప్రభావం చూపించాడు. దాంతో ఈ సినిమా అభిమానులకు అసలు సిసలు సంబరమైతే, సాధారణ ప్రేక్షకులకూ ఓ మంచి మాస్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది.

ఇంటర్నేషనల్ టచ్ ఇస్తూ సినిమాని ఆరంభించిన దర్శకుడు అడుగడుగునా ఎలివేషన్స్‌తో కట్టిపడేసే ప్రయత్నం చేశాడు. షెకావత్ పట్టుకున్న తన మనుషుల్ని పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి విడిపించడం, మొదలుకుని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి తన మార్క్ రాజకీయం చేయడం వరకూ సాగే సన్నివేశాలతో పుష్ప పాత్ర నైజం ఎలాంటిదో ఆవిష్కరించాడు దర్శకుడు. ఆ తర్వాత మాల్దీవుల్లో వ్యాపార ఒప్పందం, అక్కడ వంద కోట్లతో పుష్ప చేసే కొనుగోలు సినిమాలో ఉన్న మరో కీలకమైన ఎలివేషన్‌. ఇక పుష్ప, షెకావత్ ఒకరికొకొరు వేసే ఎత్తులు పైఎత్తులు అసలు సిసలు డ్రామాని పండిస్తాయి.(Pushpa 2 Review Telugu rating) ప్రథమార్ధం అంతా ఒకెత్తైతే, విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు మరో ఎత్తు. పుష్ప… షెకావత్‌కి ఊహించని రీతిలో ఝలక్ ఇవ్వడం ఆకట్టుకుంటుంది. అలాగని సినిమా పుష్ప వ్యాపారం చుట్టూనే సాగదు. కుటుంబ నేపథ్యంలో సాగే డ్రామా కూడా కీలకం. తన భార్య శ్రీవల్లి మాట జవదాటని భర్తగా పుష్ప నడుచుకునే తీరు, వాళ్లిద్దరి మధ్య ప్రేమ, పీలింగ్స్ సన్నివేశాలు గిలిగింతలు పెడతాయి. భర్త… భార్య మాట వింటే ఎలా ఉంటుందనే విషయాన్ని కథతోనూ లింక్ పెట్టిన తీరు ఆకట్టుకుంటుంది

.ద్వితీయార్ధంలో గంగమ్మ జాతర (pushpa 2 gangamma thalli jathara) ఎపిసోడ్ హైలైట్. అల్లు అర్జున్ చీర కట్టుకున్నప్పుడంతా థియేటర్ దద్దరిల్లిపోతుంది. జాతర ఎపిసోడ్‌లో హీరోయిజం, భావోద్వేగాలు పతాక స్థాయిలో పండాయి. ఇదే జాతర ఎపిసోడ్‌లో శ్రీవల్లి పాత్ర కూడా కీలకం అయ్యింది. ఆ తర్వాత రెండు వేల కోట్ల విలువ చేసే ఎర్రచందనాన్ని రాష్ట్రం, దేశం సరిహద్దుల్ని దాటించే ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది.(Pushpa 2 The Rule Review) ద్వితీయార్ధంలో చాలా వరకు కుటుంబం చుట్టూనే సన్నివేశాలు సాగాయి. ప్రి క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ అయితే అప్పటిదాకా సాగిన కథ నుంచి పూర్తిగా బయటికొచ్చినట్టుగా అనిపిస్తాయి. కథలోని అసలైన డ్రామా కట్ అయినట్టు అనిపించినా, పతాక సన్నివేశాల్లో భాగంగా వచ్చే పోరాట ఘట్టం, కుటుంబ భావోద్వేగాలు అలరిస్తాయి. పాటలకి మంచి టైమింగ్ కుదిరింది. ఫస్టాఫ్‌లో పీలింగ్ పాట మాస్‌తో విజిల్స్‌ వేయిస్తే, సెకండాఫ్‌లో సూసేకి, కిస్సిక్ పాటలు (kissik song pushpa 2) ఆ ఎనర్జీని మరోస్థాయికి తీసుకెళ్తాయి.

మరి సినిమాలో మైనస్‌లేవీ లేవా అంటే.. మూడు గంటల నిడివి ఉన్న ఈ సినిమాలో సాగదీత కూడా ఎక్కువే. ఆరంభంలో వచ్చే ఫైట్‌కీ, కథకీ సంబంధమేమీ ఉండదు. ద్వితీయార్ధంలో షెకావత్‌కి పుష్ప ఓ బాక్స్‌లో పువ్వు పంపించడం, ఆ తర్వాత ఇద్దరూ సంజ్ఞలు చేసుకుంటూ సాగే ఎపిసోడ్ వృథా. సంభాషణలు పలికే విధానంలో కాస్త స్పష్టత కరవైంది. తొలి చిత్రం తరహాలోనే ఇందులోనూ బలమైన విలనిజం కనిపించలేదు. షెకావత్‌ పాత్రని పరిచయం చేయడంలో ఉన్నంత బిల్డప్ దాని ఎగ్జిక్యూట్ చేయడంలో లేదు. విలన్‌ పాత్ర కాస్త బలంగా ఉన్నప్పుడే హీరో పాత్ర ఎలివేట్‌ అవుతుంది. పుష్ప పాత్ర బలం ముందు షెకావత్ తేలిపోయాడు. మంగళం శ్రీను, ద్రాక్షాయణి పాత్రలు ఇందులో ఇంకా సాదాసీదాగా సాగుతాయి. ఓ ఆసక్తికర మలుపుతో ‘పుష్ప3’కు బాటలు వేశారు.

ఎవరెలా చేశారంటే..
అల్లు అర్జున్ (Allu Arjun) మరోసారి పుష్ప పాత్రలో ఒదిగిపోయాడు. యాస, హావభావాల విషయంలో ఈసారి ఇంకాస్త డోస్ పెంచి నటించాడు. పోరాట ఘట్టాలు, డ్యాన్స్‌లపైనా మరింత ప్రభావం చూపించాడు. జాతర ఎపిసోడ్‌లోనూ, పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరోస్థాయిలో ఉంది. జాతీయ అవార్డు విషయంలో ఉన్న అనుమానాలను జాతర ఎపిసోడ్‌లో తన నటనతో బన్ని పటాపంచలు చేశాడు.

రష్మికతో (Rashmika) కెమిస్ట్రీ బాగా కుదిరింది. పీలింగ్స్‌, సూసేకి పాటల్లో ఇద్దరి జోడీ, వాళ్లు కలిసి చేసిన డ్యాన్సులు మెప్పిస్తాయి. రష్మిక ఈ సినిమాతో గ్లామర్ డోస్ కూడా పెంచింది. జాతర ఎపిసోడ్‌లోనూ ఆమె నటన బాగుంది. ‘కిస్సిక్’ పాటతో మెరిసిన శ్రీలీల (Sreeleela) డ్యాన్స్‌తో దుమ్మురేపింది. అందంతోనూ ఆకట్టుకుంది.

షెకావత్ పాత్రలో ఫహద్ ఫాజిల్ ఒదిగిపోయాడు. కానీ ఆ పాత్ర చాలా చోట్ల తేలిపోయింది. ఓ స్థాయిలో పరిచయమైన ఆ పాత్రలో సినిమా సాగుతున్న కొద్దీ సీరియస్‌నెస్ తగ్గిపోతూ వచ్చింది. ఆ పాత్ర ముగింపు కూడా లాజికల్‌గా అనిపించదు. రావు రమేష్ తప్ప సునీల్‌, అనసూయ తదితరుల పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం లేదు. పతాక సన్నివేశాల్లో జగపతిబాబు, కన్నడ నటుడు తారక్ పొన్నప్ప భయపెడతారు. అల్లుఅర్జున్‌కి స్నేహితుడిగా జగదీష్ కీలక పాత్రలో కనిపిస్తాడు. ‘పుష్ప1’కథను కేశవ పాత్రతో చెప్పించారు. దానివల్ల కథనంలో ఓ మేజిక్‌ ఉంది. ఇందులో అది మిస్సయింది.

సాంకేతికంగా.. సినిమా ఉన్నతంగా ఉంది. ప్రతి విభాగం మంచి పనితీరుని ప్రదర్శించింది. దేవిశ్రీప్రసాద్ (pushpa 2 music director) పాటలు, నేపథ్య సంగీతంతోనూ కట్టిపడేశాడు. మరో సంగీత దర్శకుడు సామ్ సీఎస్ కూడా నేపథ్య సంగీతంలో కీలక పాత్ర పోషించాడు. కూబా కెమెరా పనితనం సినిమాకి ప్రధాన ఆకర్షణ. కెమెరాతోపాటు, విజువల్ ఎఫెక్ట్స్, కళా విభాగం పనితీరుతో ప్రతి ఎపిసోడ్ గ్రాండియర్‌గా కనిపించింది. శ్రీకాంత్ విస్సా మాటలు (pushpa 2 dialogues) ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్‌లోనే (pushpa 2 duration) పదును లేదు. సినిమా స్థాయి, అంచనాల మేరకు రాజీపడకుండా సాగిన సుకుమార్ (pushpa 2 director) మేకింగ్‌… హీరోయిజం, భావోద్వేగాల పరంగా ఆయన తీసుకున్న జాగ్రత్తలు సినిమాకి ప్రధాన బలం. ప్రతినాయక పాత్రల్ని డిజైన్ చేసిన విధానంలోనే లోపాలు కనిపిస్తాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం ఉన్నతంగా ఉంది. ప్రతి సన్నివేశంలోనూ రిచ్‌నెస్ కనిపిస్తుంది,

బలాలు

  • అల్లు అర్జున్ నటన
  • మాస్ ఎలివేషన్స్
  • జాతర ఎపిసోడ్‌లో భావోద్వేగాలు
  • పాటలు, డ్యాన్స్
    బలహీనతలు
  • బలం లేని విలనిజం
  • ద్వితీయార్థంలో కథ
    చివరిగా: పుష్ప2… థియేటర్లలో అల్లుఅర్జున్‌ రప్ప రప్పా

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *